మధుర స్వప్నంలో అధర సంతకం







సంధ్యా సమయంలో చెరువు గట్టుపై కూర్చొని
ప్రకృతిని తీక్షణంగా వీక్షిస్తూ...
నాతో నేను మదిలో మాట్లాడుతూ ఉండగా
వెనుక నుంచి నా కన్నులు మూసిన చేతుల స్పర్శ
నా కనురెప్పలకు కాస్త నొప్పి కలిగించింది.

ఆ మనిషి ఎవరో తెలుసుకుందాం అని
ఎవరు అని నేను అనగానే
స్వరాన్ని సవరిస్తూ...
ఎవరో చెప్పుకోండి చూద్దాం అనే మాట వినపడింది.

నేను ఎవరో తెలియదు అని చిన్నగా నవ్వాను
కన్నులు మూసిన ఆ చేతులు
నన్ను వీడి నాకు అందమైన ప్రపంచాన్ని చూయించడమే కాదు
మనసు మురిసిపోయేలా ఏ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానో
ఆ ఎదురు చూపులు ఫలించేలా ఆనందం ప్రసాదించాయి

నా కనులు మూసిన వ్యక్తి
నా ముందుకు వచ్చి అయ్యో పొరపాటు జరిగింది
నా అభిసారిక నాకోసం ఎదురుచూస్తుంది అనుకొని
మిమ్మల్ని వెనక నుంచి చూసి అలా తప్పు చేశాను

అయినా కానీ
తప్పు జరిగిపోయింది ఐ లవ్ యూ అండి అని నవ్వసాగాడు

ఏంటీ తప్పు చేస్తే ఐ లవ్ యూ చెప్తారా తమరు అని
నేను కొంచెం కోపం ప్రదర్శించాలని చూసి
రేయ్ సత్య నిన్ను...
అని నేను ప్రేమతో కొట్టబోయాను

తను నా చేతులు పట్టుకుని
ఏంటే నేను ఎవరో తెల్వదా
అని నన్ను తనకేసి అదిమి పట్టుకుని ఆటపట్టిస్తున్నాడు
తన చేతులు ఎంత బలంగా ఉన్నాయంటే
నేను తన పట్టు నుండి తప్పించుకోలేక
రేయ్ విడవరా
నీ చేతులు ఏంట్రా మొరటుగా ఉన్నాయి అని అన్నాను

ఏంటి మేడం మొరటోడి చేతులు సున్నితంగా ఎలా ఉంటాయ్
నా మాటలు చేతలే కాదు చేతులు కూడా రఫ్ గా ఉంటాయ్
అని నన్ను మరింత గట్టిగ తన గుండెలకు హత్తుకుని
వదిలేయమంటవా సిరి అని అనగానే

నేను తన కౌగిలిలో లీనమై పోయి
ఎద చప్పుళ్ళ గేయాలు వింటూ...
వదులురా అని చిన్నగా అంటున్నానే కానీ
లోపల మాత్రం ఎంత‌ బాగుంది రా
ఈ విశ్వం లో మనం మాత్రమే ఉన్నామనేంత హాయిగా
మనకు మనమే తప్ప మరొక ఆలోచన లేని ఈ క్షణాలు యుగాలు గా మారని అని అనుకుంటూ ఉన్న

ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో నీ తలంపే ఉన్నదే
నిన్ను ఎలా విడిచిపెట్టాలే
నువ్వు లేని ఊహకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది
సిరి ఎలా విడవాలే అని ఏదో కవిత్వం చెప్పబోతుంటే
రేయ్..సత్య ఏంట్రా నీ పసిమనసు కూడా భావోద్వేగంతో
కవిత్వం చెబుతున్నావ్ ఎలా వుందేంటి
అని నేను ముసి ముసి గా నవ్వుతుంటే

నీ ప్రేమతో నాలోని పసివాడికి కూడా
కవిత్వం వచ్చేలా చేస్తున్నావే సిరి ఇప్పుడు చెప్పు నిన్ను విడిచి పెట్టాలా అని అన్నాడు
నేను తప్పదు రా విడువు
ఎంతసేపని ఊపిరి బిగపట్టి నీ కౌగిలిలో సేదతీరుతుంది చెప్పు నా తనువు అని
సత్య బుగ్గలు గిల్లుతూ...చెప్పాను

ఇదిగో ఇలాంటి నీ చేష్టలే
ఇంకా గట్టిగా అదిమి పట్టుకునేలా చేస్తున్నాయి సిరి
అని అధరాల ఆలింగనం తో తనలో నాపై ఉన్న ప్రేమను చెప్పబోతుంటే...

ఒక్కసారిగా నా మస్తిష్కం మేల్కొని ఇద్దరి పెదాల మధ్యన నా చూపుడు వేలు అడ్డంగా నిలిపింది
దాంతో‌... తొలిసారి అధరాల మధువుల రుచి చూద్దాం అంటే
నీ సిగ్గుతో అరచేతి అంగరక్షకుడిలా చూపుడు వేలు అడ్డుపడింది
ఏంటో మొదటి చుంబనపు తీపిని రుచి చూసే అదృష్టం లేదేమో అని సత్య వెంటనే నుదురుపైన పాపిట సింధూరం ధరించే చోట చుంబనం బహుమతిగా యిచ్చి యిదే నీకు నేను యిస్తున్న అమూల్యమైన కానుక సిరి అని చెప్పాడు

దాంతో నాలో కలిగిన తన్మయత్వంతో ఒక్కసారిగా
ఐ లవ్ యూ రా సత్య‌ జీవితాంతం యిలానే వుండాలిరా నాపై నీ ప్రేమ అని అంటు ఉన్న
అంతలోనే తెలవారిందేమో ఒక్కసారిగా మెలకువ వచ్చింది
ఎంతటి అందమైన స్వప్నం
నా ప్రియుని గురించి నా ఆలోచనలను
ప్రేమను నా కనుల తెరలపై
అద్భుతంగా చూపించిన స్వప్నమా నీకు వందనం అని అనుకుంటూనే...

ఈ నా కల నిజంగా జరిగితే బాగుండు అని మనసంతా
సత్యపై ప్రేమతో...నా ఈ రోజు ప్రారంభమైంది.

కానీ సత్యకై ఎన్నాళ్ళు ఇలా కలలు కంటు ఉండటం
తనతో నా ప్రేమ విషయం చెప్పలేక ఎంతలా మదన పడుతున్నానో
ఎలాగైనా ఈ రోజు సత్యకి నా ప్రేమ విషయం చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నా  ప్రతి రోజూ ఇలాగే అనుకుంటా కాని తను ఎదురైతే అసలు చెప్పలేకపోతున్న అని

నా అసమర్థకు నన్ను నేను తిట్టుకుంటూ ఉంటున్న
అసలు సత్యతో ఎలా పరిచయం అయ్యిందంటే
ముందు నా గురించి చెప్పాలి

నా పేరు శృతకీర్తి
సిరి అనేది నా ముద్దు పేరు

నేను ఒక ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న
గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనే ఆశయంతో
సాయంత్రం కోచింగ్ సెంటర్ కి వెళ్లి ప్రిపేర్ అవుతున్న

అక్కడ హిస్టరీ సబ్జెక్ట్ క్లాస్ విన్నాక
క్లాస్ ఇంత అర్థవంతంగా కళ్ళకు కట్టేట్టుగా చెప్పడం
క్లాస్ ఇంకా వినాలి అనేంత క్యూరియాసిటి కలిగిస్తూ...చెప్పిన అతనికి నేను అభిమానిగా మారిపోయానేమో అని అనిపించింది.

అసలు ఆ కోచింగ్ సెంటర్ లో హిస్టరీ క్లాస్ విన్న
ప్రతి ఒక్కరూ అలాంటి అనుభూతికి లోనవుతారు అని అందరూ చెబుతుంటే ఏంటో అనుకున్నా

కాని ఒక కాలేజి లెక్చరర్ అయిన నాకు కూడా అతనిపై అభిమానం కలిగింది

తనది నా వయసే కానీ బోధనలో ఇంతటి అపార అనుభవం ఎలా సాధించాడో అని ఆశ్చర్యం వేసింది

ఆ తర్వాత అతని గురించి కనుక్కుందాం అని అక్కడే ఫ్యాకల్టీ గా పనిచేస్తున్న మా ఫ్రెండ్ ని అడిగితే తెలిసింది

తన పేరు సత్య అని తను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్ గా
పనిచేస్తు...తన ఫ్రెండ్ నిర్వహించే కోచింగ్ సెంటర్ లో
ఉదయం సాయంత్రం  ఓ గంట పాటు ఇలా క్లాస్ చెప్పడానికి వస్తున్నట్టు

అది కూడా ఎలాంటి వేతనం లేకుండా సబ్జెక్ట్ చెబుతున్నాడని విని నిజం గా అతనంటే అభిమానం పెరిగింది

తనతో ఎలాగైనా మాట్లాడాలి అని తన నెంబర్ తీసుకుని కాల్ చేశా
కానీ ఏం మాట్లాడాలో తెలియదు మాట్లాడాలని వుంది

హాలో సత్య గారు నా పేరు సిరి నేను మీ స్టూడెంట్ నీ అని పరిచయం చేసుకున్నా

చెప్పండి ఏదైనా డౌట్ ఆ అని అడిగితే
అదేం లేదండీ మీతో మాట్లాడాలి అని ఫోన్ చేశా అంతే చెప్పగానే
ఏం మాట్లాడాలి చెప్పండి అని అడిగారు

ఏం లేదండీ మిమ్మల్ని కలవాలని ఉంది అని అడగగానే
ఇప్పుడేనా అని అన్నాడు
అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా అండి అని అడిగాను

నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటా మేడం అని నవ్వారు
సరే అండి అయితే మీరెక్కడ ఉన్నారో చెప్పండి వస్తాను అని అన్నాను

అదేం లేదండీ మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి
నేనే వస్త అని చెప్పగానే

మీకెందుకు శ్రమ నేను వస్తానండీ అన్నాను.

సరేనండీ మన కోచింగ్ సెంటర్ పక్కన ఒక బుక్ షాప్ ఉంది కదా అందులో ఉన్నాను రండి అని చెప్పాడు

నేను అక్కడికి వెళ్లి సత్యను కలిసి మాట్లాడుతుంటే
మనం ఇంతక ముందు ఎప్పుడో కలిశాం అనిపిస్తుంది అన్నాడు

నేను నా మదిలో ఎంత గొప్ప వారైనా మగ బుద్ధి పోనిచ్చుకోరు అనుకుంటూనే
కొందరిని కలిసినప్పుడు అలానే అనిపిస్తుటుంది అండి అన్నాను

సరే నండి అసలు విషయం మర్చిపోయారు
కలవాలి అని చెప్పారు ఎందుకో...అని అనగానే
అదే నండి ఈ రోజు మీ క్లాస్ విన్నాక మిమ్మల్ని మీట్ అవ్వాలి అనిపించింది అందుకే అని చెప్పాను.

సత్య గారు
మళ్ళీ మిమ్మల్ని ఇలానే కలవాలంటే
ఎక్కడ కలవాలి అని నేను అడిగితే

రోజు ఈ టైం లో ఇక్కడే ఉంటా నండి అని చెప్పాడు

అంటే ఈ బుక్ షాప్ మీదేనా అని అడిగా
దానికి సమాధానం గా

అవును మాదే మా బాబాయి ది ఈ షాప్ అని చెప్పాడు

ఏదో సరదాకి కాసేపు మాట్లాడి
సరే ఉంటానండి అని చెప్పి నేను బాయ్ చెబుతుంటే
సిరి గారు మీరు అలా బాయ్ చెప్పకండి

నాకు బాయ్ అని చెప్పడం పెద్దగా నచ్చదు అని అన్నాడు

ఎందుకో అలా తెలుసుకోవచ్చా అని అడిగా
దానికి సమాధానంగా
హాయ్ అంటూ ఆనంద పెట్టడం
బాయ్ అంటూ బాధ పెట్టడం ఎందుకో నాకు పెద్దగా ఇష్టం ఉండదు

మీకు ఇష్టం అయితే అలానే చెప్పండి కాని నేను మాత్రం ఆ పదాన్ని వాడను అని నవ్వుతూ చెప్పారు.

ఏంటండీ మీరు కాస్త వెరైటీగా మాట్లాడుతున్నారు అని అడిగా
అదేం లేదు మీరు కొత్త గా పరిచయం అయ్యారు కదా అలానే అనిపిస్తుంది అన్నాడు

మరి ఇంతక ముందు మనం ఎప్పుడో కలిసినట్టు ఉందని చెప్పారు
కదా కొత్తగా పరిచయం అంటారు ఏంటి అని నేను నవ్వాను
అదేనండి నాకు ఇప్పటికీ అలానే అనిపిస్తుంది

ఎప్పటినుంచో పరిచయం ఉన్న వారిలా అన్నాడు

ఎంత ఉపాధ్యాయుడు అయిన
వయసులో ఉన్న యువకుడే కదా అమ్మాయి కనిపిస్తే ఇలా అంటుంటారు అని మనసు లో అనుకుని సరే ఉంటానండి

మీ పరిచయంతో
ఈ రోజు ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అని
చెప్పి ఇంటికి వెళ్ళాను

నా జీవితంలో ఎప్పుడూ లేనిది ఒక వ్యక్తి గురించి
ఇంతలా ఆలోచించడం ఇదే మొదటిసారి

అది ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు అనే కన్న
నా మనసు తన పరిచయం కోసం పరితపిస్తుంది అని అనడం ఉత్తమం

ప్రతి రోజూ యిలాగే అనిపిస్తూ...ఉండటంతో
సత్యకు దూరం అవ్వాలి లేకపోతే నా మనసులో తను నిండిపోయి తన ఆలోచనలతో నా లక్ష్యాన్ని మరిచేలా ఉన్నాను అనుకుని తన నెంబర్ డిలీట్ చేసి తనని కలవడం మానేశాను

కేవలం క్లాస్ మాత్రమే వినడం చేసేదాన్ని తను కూడా
నన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని
వెళ్ళిపోవడం జరిగేది

కానీ ఎందుకో తనని నేను ఇలా దూరం పెడితే
ఏమనుకుంటున్నాడో అని
ఓ రోజు సాయంత్రం కలిశాను
ఏంటి సిరి గారు మీరు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు
ఈ మధ్య కలవడం లేదు అని అంటూనే
ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడిగాడు

అయ్యో బిజీ అంటే ఎప్పుడు ఉండేదే సత్య గారు
నా ప్రిపరేషన్ బాగానే ఉందండి
కానీ మనసు ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని కలవడం లేదు
అంతే అని చెప్పాను

డిస్ట్రబ్ ఎందుకండీ మీ సంకల్ప బలం ముందు
కొన్ని ఆలోచనలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోతాయ్
ముందు మీ ఆలోచనంతా
సబ్జెక్ట్ లపై పెట్టండి అని చెప్పాడు
నాలో నన్ను లేకుండా చేస్తూ... ఏంట్రా ఇలా సూక్తి చెబుతావు  అని లోలోపల అనుకున్న

అలా మాట్లాడితుంటే సత్య
ఎందుకో నీతో మాట్లాడితే నన్ను నేను పూర్తిగా మర్చిపోతున్న అని చెప్పిన

అదే ఇంతక ముందు మనకెప్పుడో పరిచయం ఉంది కావునే
అలా అనిపిస్తుంది సిరి అని అన్నాడు

అవునా అయితే గత జన్మలో కావచ్చు అని నేను చెప్పగానే

అంత లేదు బుజ్జి
గత జన్మల బంధం అనేది సినిమా కహానీలో ఉంటుంది
జీవితంలో కాదు అని అతి చనువుతో చెప్పాడు.

కానీ తను బుజ్జి అనడం మాత్రం నాకు
ఎందుకో కాస్త సంతోషంగా అనిపించి

ఏంటండీ ఎప్పుడు లేనిది ఒక్కసారిగా బుజ్జి అన్నారు
ఏంటి విషయం అని అన్నది

ఏం లేదు ఏదో మాటల ఫ్లోలో అలా వచ్చేసింది అని చెప్పి
బుజ్జి అనకూడదా బుజ్జి అని లోలోపల నవ్వుకుంటూ అన్నాడు

ఎంత మంచి వాడిలా నటించినా
నాకు పడిపోయాడు గురుడు
నన్ను పడేయడానికి ఇలా అంటున్నాడు అని
నేను లోలోపల అనుకుని

సరే సత్య ఉంటాను అని చెప్పగానే
అపుడేనా బుజ్జి ఇంకొంచెం సేపు ఉండిపోరాదు అని అడగగానే

సర్ మీరు మరి చనువుగా
మాట్లాడితే ఇలా ఉంటుందా
ఇకపై మాట్లాడను మీరు బుజ్జి అంటుంటే ఏదోలా ఉంది అని చెప్పాను.

సారి అండి
మా అమ్మను బుజ్జమ్మ అని పిలిచేవాడిని
అలా నాకు నేస్తంలా మారిన మొదటి అమ్మాయిని బుజ్జి అని పిలవాలి అనిపించింది అని చెప్పాడు.

ఆ మాట ఎప్పుడో విన్నట్టు గుర్తొచ్చి
వెంటనే అరె సత్తి అని అనగానే
ఏంటి బుజ్జమ్మ గుర్తొచ్చిందా
మనం చిన్నప్పుడు ఒకే క్లాస్మేట్స్ అని నవ్వాడు

అరె క్లాస్ మేట్ మాత్రమేనా ఎంత జిరిగి దోస్తాన్ మనది
సత్య నేను అసలు నిన్ను గుర్తు పట్టలేకపోయా
ఇంతలా మారిపోయావ్ అసలు నీ గతానికి ఇప్పటికీ
పోల్చలేము అని ఎంతో ఎక్సైట్ మెంట్ తో సత్యని హగ్ చేసుకున్న

అవును సత్య నేను నీ బుజ్జిని అని ఎలా గుర్తుపట్టావ్

అని అడిగితే సిరి నువ్వు కలిసి మొదట్లో చెప్పానుగా
మనం ఇంతక ముందు ఎప్పుడో కలిశాం అని
దాని గురించి ఆలోచిస్తూ... ఉండేవాడిని

నువ్వు సడెన్ గా కలవడం మానేశాక పూర్తిగా నీ గురించే ఆలోచిస్తూ...
నీ డీటెయిల్స్ తెలుసుకున్న అప్పుడు తెలిసింది నువ్వు బుజ్జి వి అని

మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా అని అడిగితే
సమయం వచ్చినప్పుడు చెబుదాం సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా ఇలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పాడు.

అవును సత్య
మీరు ఊరి నుంచి వచ్చాక నువ్వు ఏదో పని చేస్తూ చదువు మానేశావ్ అని అనుకోవడం విన్న కానీ నీ జీవితం పూర్తిగా మారిపోయేంతలా చదవావు గ్రేట్ సత్య అని అన్నాను

అవును బుజ్జి అమ్మానాన్నలు లేని పిల్లల జీవితాలు ఎలా మారిపోతాయో నన్ను చూస్తే తెలుస్తుంది
అని నవ్వే ముఖం తో వున్న సత్య కా‌స్త సీరియస్ గా ఎవరిపైనో కోపంతో ఉన్నట్లు మాట్లాడాడు

సారి సత్య నీ గతం గుర్తు తెచ్చి నిన్ను బాధ పెడితే
అని అంటుంటే
సారి ఎందుకు సిరి నా గతాన్ని నే మరువలేను
అలా గుర్తుంచుకోలేను అది ఎప్పుడు మదిలో మెదులుతుంది
అని చెప్పాడు.

సరే బుజ్జి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది
మనం నిత్య విద్యార్థులం ఇలా ఎమోషన్ తో టైం వేస్ట్ చేయోద్దు
రేపటి కోసం ఈ రోజు ప్రిపేర్ అయ్యే ఉపాధ్యాయులం
వెళ్దామా అని చెప్పి తను నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు

సత్యపై ఏదో తెలియని ఫీలింగ్ అని చెప్పేకంటే
తెలిసిన ప్రేమ ఫీలింగ్ కలిగింది కాదు కాదు నాకు నేను ఒప్పుకున్న

తను నా సోల్మేట్ అని ఇక సత్య నాలోని మనిషి
అని తనకై అందమైన కలలు కనడం అలవాటు అయ్యింది
కానీ తనతో నేరుగా ప్రేమను చెప్పలేకపోతున్న

సత్య నాకు రోజురోజుకూ కొత్తగా కనిపిస్తూ..
నాలో ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాడు
తనతో ఇదివరకటిలా మాట్లాడలేకపోతున్న
తన మాటల ప్రవాహం లో కొట్టుకపోతూ
తనకై ఊహల లోకాన విహరిస్తున్న తరుణం లో
సాహసం చేసి సత్య మనసులో ఏముందో అడుగుదాం అని
సత్య ప్రేమంటే ఏంటో నీ మాటల్లో చెప్పగలవా అని అడిగా
తను ఏ ఆలోచన లేకుండా
అదా ఏముంది స్వార్థం అని చెప్పి నా ప్రేమ మాయ పొరని అంతా
పగులగొట్టాడు

ఏంటి సత్య అని అంటే అవును
నా దృష్టిలో ప్రేమంటే స్వార్థమే అని చెప్పాడు
అవును కంటికో మనసుకో నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తారు

మనకు నచ్చని వారినో
లేదా మన భావాలతో ఏకీభవించని వారినో ద్వేషిస్తాం
అవసరం అంతే మనిషికి ఉండేది స్వార్థం మాత్రమే

అది లేకపోతే మనిషి పిచ్చోడు అని
అంతే తేలికగా చెప్పేశాక ఏం మాట్లాడాలో తెలియక నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావ్ కదా

డబ్బే లోకంగా బ్రతికే మనుషులకు ప్రేమంటే అలానే ఉంటుంది లే అని చెప్పాను

ఏంటి బుజ్జి నువ్వు చెప్పేది
మనుషుల్ని నడిపించేది ప్రేమ కాదు డబ్బు కాదు
కేవలం భావోద్వేగం మాత్రమే అని ఏదో ఫిలాసఫర్ లా మాట్లాడాడు

నాకు ఎందుకో తన వాదనతో ఏకీభవించక
ఇంతకీ నువ్వు ప్రేమించావా ఎవరిని అయినా అని అడిగా
తను వెంటనే అవును ప్రేమించా  ఒకప్పుడు
ఇప్పుడు కాదు అని చెప్పాడు

అదేలా ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం ఏంటి అని అడిగితే
అప్పుడు చిన్నవయసు ఏదో కవిత్వం రాసేంతలా ప్రేమించా
ఆ తర్వాత అర్థం అయింది ప్రేమ అనేది స్వార్థం అని

నాకు ఇప్పుడు అర్థం అయ్యింది సత్య
నీతో మాట్లాడటం ఎందుకు కొందరికి మరి కష్టమో
మరికొందరికి మీ మాటలు వినాలని ఇష్టమో
మీలో ఓ ఫిలాసఫర్ ఉన్నాడు అని చెప్పగానే

హలో మేడం అంత పెద్ద పదాలు వాడకండి
నేను మాములు మనిషిని అంతే
అని చెప్పాడు

నువ్వు మాములోడివి కాదురా నన్ను నాలో లేకుండా చేసే
ఓ మాయావి రా 
నా ప్రేమ నీకెలా చెప్పాలి రా అని నాలో నేను తెగ ఆలోచించే దాన్ని

సిరి అడగటం మర్చిపోయా నీ ప్రిపేరేషన్ ఎలా వుంది అని
అడిగాడు హా సత్య అవుతుంది అని చెబితే
నా వల్ల ఏం ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఆల్ ది బెస్ట్ బుజ్జి
బాగా ప్రిపేర్ అవ్వు ఇకపై నేను కోచింగ్ సెంటర్ కి రాను
నాకు వేరే పని వుంది అని చెప్పాడు

సరే అని చెప్పి తనకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పా
కానీ నా ఆశయమే నువ్వైనప్పుడు

ఇంకో ఆశయం కోసం ఆలోచిస్తున్న అమాయకురాలిని అని అనుకుంటుంటే
నా మనసు నాకు మరోసారి ఒసేయ్ నీ ఆశయం నేరవేర్చకో...

నువ్వు అనుకున్న జాబ్ చేస్తేనే ఆనందంగా ఉంటావ్
గీ ప్రేమ గీమ జాంతానై అని తిట్టినట్టు అన్పించి

ఎక్జ్సామ్ కి ప్రిపేర్ అయ్యి రాశాక సాయంత్రం సత్యకి కాల్ చేశా....
తను రేపు కలుస్తా అని చెప్పాడు

రేపు ఎలాగైనా సత్యను కలిసి
నా ప్రేమ విషయం చెప్పాలి అని గట్టిగా నిర్ణయించుకున్నా
నిద్రించే ముందు తన ఫోటోను ఫోనులో చూస్తూ...
సత్య పేరును కలవరిస్తూ
తనపై ప్రేమ శ్వాసతో ధ్యానిస్తున్న
ఒక్కసారిగా నా పెదవులపై వేడి శ్వాస తగిలింది
ఆ వెంటనే తడిగా మరో మధుర స్పర్శతో నా ఊపిరి స్తంభించేలా
ఉండటంతో కళ్ళు తెరిచి చూసా
అది నా భ్రమ అని అర్థం అయ్యింది

రేయ్ సత్య నన్ను ఎంతలా ఆక్రమించావ్ రా
ఎప్పుడు లేని వేడి సెగలతో
ఒల్లంతా ఒకింత గమ్మత్తుగా అనిపించేలా చేస్తున్నావ్...
నీకు నా ప్రేమను మాటల్లో మాత్రం చెప్పలేనురా
కేవలం ఐ లవ్ యూ అంటే అది తక్కువ మాత్రమే అని
రేపటికై అందమైన కలలు కంటూ...
కనురెప్పలు మూశానో లేదో
ఎద తలుపులు తెరుచుకుని
నా ఎదపై చేరి ఎప్పుడు చూడని చిలిపి వలపుతో
మాటలు లేని మౌన ప్రపంచంలో మత్తుతో కూడిన స్వర్గానికి
మహారాణిని చేసి నీ ప్రేమ రసగమ్మత్తులకు నేను ఎప్పుడూ దాసోహమే సిరి అని నా తనువు పై సేద తీరుతుంటే...
తన బరువు నాపై ఏం మాత్రం భారంగా అనిపించకపోగా
అది నా ఆడతనపు సొగసులకు దక్కిన గౌరవం అనిపించింది

మన తనువుల మధ్య బంధించబడిన గాలి
శృంగార రస ధూపపు వాసనతో
మనల్ని మత్తెక్కిస్తుంటే...
మన మధ్య ఉన్న రహస్యాన్ని
సమాజం ఒక పవిత్ర బంధం అనుకోవాలంటే
నువ్వు మోయాల్సింది నన్ను మాత్రమే కాదు నా ప్రతిరూపమైన తాళిని నీ ఎదపై మోయాలి అది నీకు ఇష్టమేనా అని చెబుతూ
నా సమాధానం వినకుండానే అధరాలపై సంతకంలా
ఇహపరలోకాలు మరిపించే మురిపించే చుంబన బహుమానం యిస్తుంటే అరేయ్ నా సమాధానం వినకుండా
అలా చేస్తావేంట్రా అని విడువు ముందు నా సమాధానం విను అని నాలో నేను అనుకుంటూ...తన పట్టునుండి తప్పించుకుందాం అని గట్టిగా నెట్టాను వెంటనే ఉలిక్కిపడి లేచిన నాకు
సత్య కనిపించలేదు అదంతా కల అని తెలుసుకుని
అయ్యో మధుర స్వప్నంలో అధర సంతకం ఎంత బాగుంది
నా తొందరపాటుతో మెలకువ అయ్యింది అని తిట్టుకున్నా కానీ
ఎప్పుడు తెలవారుతుందా ఎప్పుడు సత్యకి ప్రపోజ్ చేద్దామా అని చూస్తున్న సమయం వచ్చింది

సత్యను కలిసేందుకు
ఎంతో అందంగా ముస్తాబై వెళ్ళాను
సత్య నన్ను చూడగానే ఏంటీ బుజ్జి
ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నావా అని అన్నాడు
నేను అవును అన్నట్టు
ఎక్జ్సామ్ అయిపోయింది కదా
అమ్మానాన్నలు ఎప్పట్నుంచో పెళ్ళి అంటున్నారు
దాని కోసం చూసుకోడానికి పెళ్ళి వారు వస్తున్నారు అందుకే ఇలా అని చెబుతుంటే...
నవ్వులతో వెలుగిపోయే సత్య ముఖం నిరాశ రంగు పులుముకోవడం దాన్ని అతడు కవర్ చేసుకునేందుకు ఓ కంగ్రాట్స్ డియర్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయింది

దాంతో
ఏమన్నా చెప్పాలా సత్య అని అడిగా
అది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు
కానీ అదో రహస్యం అని అన్నాడు

ఏంటో తమరి రహస్యం అని నేను గొణుక్కుంటూ అడిగా
అది ఇది వరకు ఎవరికీ చెప్పలేదు
మొదటి సారి చెప్తున్న ఎందుకో చెప్పకపోతే ప్రాణం పోదు కాని
పోయినట్టే ఉంది అని
నువ్వంటే ఇష్టం సిరి
ఐ లవ్ యూ బుజ్జి అని చెప్పి
హమ్మయ్య ఈ విషయం చెప్పడానికి ఇన్నాళ్లు పట్టింది
ఇక నీ ఇష్టం
నేనైతే చెప్పేశా అని తను అంటుంటే...
నేను నా మధుర స్వప్నంలో అధర సంతకం
ఇక్కడ అప్లై చేశా
వెంటనే ఎప్పుడు రుచి చూడని మధువుల రుచి చూసి
నిశ్చేష్టుడై...ఉండి కాసేపు ఆగాక

ఏంటే బుజ్జి అవతల పెళ్లి చూపులు పెట్టుకుని ఇదేంటి
అని అన్నాడు
అయితే తమర ప్రపోజ్ చేయడం మంచిపనా..అని అడిగా
అంటే అది
నేను ఇదివరకు ఒక అమ్మాయి విషయంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని
నా మనసులో ఉన్న మాట చెప్పేశా ఇంకా నువ్ దూరమైనా
నీకు నా ప్రేమ చెప్పలేక పోయా అనే గిల్టీ ఫీలింగ్ ఉండకూడదు అని అలా అని చెప్పాడు

అరేయ్ నిజంగా నీ ప్రేమ స్వార్థం లేనిది
మరెందుకు ప్రేమంటే స్వార్థం అని చెబుతావ్ అని అడిగాను
అదేం తెల్వదు కాని ఇప్పుడు ఏం చేయనే
నాలో నేను లేకుండా నీ మనసుతో అనుసంధానం అయ్యేలా
అధరాల కౌగిలింతతో నన్ను డిస్టర్బ్ చేశావే అని అన్నాడు

మరి ఇప్పుడు ఏం చేయమంటావ్ అంటే
అది అది అని ఏదో చెప్పబోతు... అకస్మాత్తుగా నా పెదవులపై
దాడి చేసి జుర్రుకోవడం మొదలెట్టి ఒక్క క్షణం కాగానే
సారి సిరి ఏమనుకోకు బలహీనతకు బలైపోయానే
అని అన్నాడు

ఒరేయ్ మొద్దు ఈ ముద్దుకే ఇంతలా ఆగం గాకు
నా పెళ్లి చూపులు నీతోనే నువ్వే నా పెనిమిటి అని చెబితే
ఏంటి పెళ్ళా....!
అయ్ బాబోయ్ అది మాత్రం వద్దు అని సారి సిరి
ఐ లవ్ యూ క్యాన్సిల్ అని చిలిపితనం తో... నవ్వాడు

ఇక ఆలస్యం చేయడం ఎందుకు సత్య
మనం పెళ్లి చేసుకుందాం అమ్మానాన్నలతో... మాట్లాడాను
వాళ్ళకు నువ్వు తెలిసుకదా సరే అన్నారు

ఇక నీకు ఇష్టం అయితే
ఇప్పుడే చేసుకుందాం పద అని చెప్పిన

ఏంటే నీ తొందర ఆగలేక పోతున్నావ్...
మనం ఇలానే కొన్నాళ్ళు ప్రేమించుకుని
పెళ్లి చేసుకుందాం అన్నాడు.

సరే నీ ఇష్టం అని చెప్పాను

బుజ్జి...
ఏదో సరదాకి అన్నాను
నీతో జతకట్టాలని నాకు తొందరగా ఉన్నది
పదా ఇట్నుంచి ఇటే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు

అదేంటి అమ్మానాన్నలు లేకుండా అని నేను అంటే...
బుజ్జి వాళ్ళు ఈ పాటికే...గుళ్ళో మన కోసం ఎదురుచూస్తూ.. ఉంటారు పద పోదాం అని చెప్పాడు

అంటే...
ఏంట్రా నువ్వు చెప్పేది అని అడిగా
బుజ్జి ఇది నీకు నేను యిచ్చే... సర్ప్రైజ్ అని కొంటెగా నవ్వుతూ...కన్ను... కొట్టాడు

అరేయ్..‌నిన్ను అని తనని ప్రేమతో కొడుతుంటే
బుజ్జి ఇకపై నీ ఇష్టం ఉన్నప్పుడు...నాతో ఇలా ఆడుకొవచ్చు ముందు పద అని చెప్పి గుడికి తీసుకెళ్ళాడు.

ఇంట్లో వాళ్ళ ముందు ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మాములుగా పెళ్లి జరిగింది.
మనసైనోడితో... జీవితం పంచుకునే అదృష్టం వస్తే
మగువ మనసులో... ఉండే ఆనందం ఎలా ఉంటుందో
అలా నేను సమస్తాన్ని జయించిన సంతోషంతో మురిసిపోతున్న

చిటికెన వేలు పట్టుకుని
కొంటె చూపులు చూస్తూ
కొంగు ముడితో...ఏడడుగులు తన వెనకాలే
నడుస్తుంటే...ఇన్నాళ్ళు ఒంటరిగా కన్న కలలన్ని
అందమై ఎదురొచ్చి నన్ను ఒకింత పులకింతను కల్గిస్తున్నాయి

అందమైన ప్రణయ రాత్రి సత్యను నా తోడుగా తీసుకరాగ


సిగలో సింగారించుకున్న మల్లెల మత్తులో...
తనువులు మైమరచిపోయి
సోయగపు అందాల్ని అణువణువు స్పృశిస్తుంటే
అధరాలపై ఆశల తడి స్పర్శని కలిగిస్తూ...
మనసులో భారమైన భావోద్వేగాలు తేలికయ్యేలా
ఒకరి బరువును మరొకరు మోస్తుంటే
విరహం మన పక్కలో...నలిగిపోయి మూలుగుతుంటే
ఏకాంత ప్రణయ పరిమళాలు
మది గదిలో నుంచి మనకు
ఉల్లాసం ఉత్సాహం కలిగించేలా
భావ రసామృతమై... ఉద్భవించి
కొన్ని క్షణాలు.. మనసంతా శూన్యమైపోయేలా
మాటల్లో చెప్పలేని వింతైన భావనకై
తనువుల రాపిడితో...అన్వేషిస్తుంటే
సృష్టి రహస్యాన్ని ఛేదించిన సంతృప్తి తడి తనువుల సొంతమైంది
అనుకుంటూ
నాలో... కలిగే భావనలతో నేనో శృంగార కావ్యాన్ని రచించగలనేమో అనిపించేలా తనతో...కలిసి అల్లుకపోయి విరహానికి విమోచనం కలిగిస్తూ గడిపిన క్షణాలను కింది పదాలుగా మార్చిన

మొదటి సారి...తడబడుతున్న నా తనువుకు
ధైర్యం చెప్పింది నీ వేడి నిట్టూర్పుల నిశ్వాస
నాలో ప్రణయ పుష్పాలు విచ్చుకునేలా చేసి
విరహ తాపపు గుబాళింపుల్ని నీ మదికి చేరవేశాయేమో

తడిలేని పెదాలు పొడి పొడి మాటలతో
నీపై ప్రేమను చెప్పలేక సంకోచిస్తుంటే...
దగ్గరగా ఉన్న నీవు నా మనసుకు మరింత దగ్గరయ్యేందుకు
నీ హస్తాల సహవాసంతో...నాజూకైన నడుముపై స్పృశించి
నా మనసులోని ప్రేమకై కవ్వంతో చిలికినట్టు...
ఒక్కసారిగా నీ కౌగిలి లోగిలిలోకి... లాక్కుని
నాభి దగ్గరి కరములు చెక్కిలిపై చేరి...
నాసిక తగలకుండా తలను అడ్డుపెట్టి
నా అధరాలకు నీ తడిని అరువిచ్చేలా...చుంబించావు

నీ మునిపంటితో...నా మృదుమధురాన్ని రుచిచూస్తూ...
ఉప్పునీటి ఊటలా కళ్ళవెంట కారే ప్రణయసుఖ భాష్పాలు
నుదురుపై ఉద్భవించిన స్వేద బిందువులలో కలిసిపోయి
నీ మోమును తడిపి నీలో భావ రసామృతాన్ని మేల్కొలిపి
బిగుసుకుపోయిన నా ఎద బరువును తేలిక చేసేందుకు
నీలో నిండిన నాపై ప్రేమను ఒలకపోస్తూ...
ఒదిగిన నీ మది గీతం వింటూ...
వింతైన గమ్మత్తైన లోకాన విహరిస్తున్న...అంటూ
సత్యతో కలిసి నా అందమైన జీవితాన్ని ఆరంభించాను.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

ఎప్పుడు చూశానో