ఉగాది యాదిలో

పొద్దున్నే తెల్లార్తుంటెనే అమ్మ నిద్ర లేప్తూ...
రేయ్..లేవ్రా ఇయ్యాల పండ్గపూట అట్ల పండుకోకపోతే అట్లవొయ్
మాడాకాలు,మోదుగ ఆకులు,యాప పూత తీసుకుని రావచ్చు కదా
అగో...బయట మీ దోస్త్ గాడు వచ్చి ఎదురు సూస్తుండు పో అని నిద్ర అంత కరాబ్ చేసింది.

అమ్మ మనకు మాడి శెట్లు ఎక్కడివే...
"పండ్గ పూట ఎవడితోనో మాటలు తినమంటవ్" నేను పోనుపో...అన్నగాన్కి శెప్పరాదు ఎప్పుడు నేనే పోవాల్నా.

అరే చిన్నోడా... పెద్దోడు అప్పుడే...పండ్గ సమాన్ తేనికే చిట్టి రాసుకుని దుక్నం కాడికి పోయిండు.
నువు షాప్ కాడికి పోరా అంటే సగం సగం సమాను తెస్తవ్ పోనీ చిట్టి రాసుకోని పోయి తెస్తవా అంటే
అమ్మో..."మా ఇస్కూల్ ల ఇంకా అంత పెద్ద సదువు నేర్పలేదే అంటవ్". అందుకే నిన్ను పొలాల పోంటి పోయి ఆకులు తెమ్మనేది.

అయినా రాతిరి నువ్వే శెప్పినవ్ కదరా
అమ్మ "రేపు పండ్గకి మాడాకులు నేనే తెస్తనే నాయనను తేవొద్దను అని" ఇప్పుడు ఇట్ల అంటవ్ బాతకానోడా 
నీ మాటలు పట్టుకోని "మీ నాయనకు తేవొద్దు అని శెప్పిన
నేను దిమాక్ లేని దానిని" 

"అమ్మా పోతున్ననే పండ్గపూట ఎందుకు తిడ్తవ్"
నేను వచ్చే వరకైతే బచ్ఛాలు(భక్ష్యాలు) చేసిపెట్టు.

బయట సైకిల్ మీద చానా సేపటి నుంచి ఎదురు చూసే...చోటు
"అరే వో హౌలే కెత్నె దేర్ దేఖ్నా బే జల్ది ఆ దూప్ మార్తే హై"

అరె వో సాలే గుస్సా క్యూ...వోరే ఛల్ జాయింగే పయిలే ఆమ్ కే జాడ్ చడింగే నైతో...నీమ్ కే జాడ్ రే సాలే 

ఆపురా బామ్మర్ది నువ్వు నీ బాష...
ముందు సైకిల్ గట్టిగ తొక్కుబే జల్ది పోయోద్దం

చోటు సాలే మాడి కాయలకు మీ చెల్కలకే పోదంరా 
మీ తాత ఏం అనడు కాయలు తెంపుకుంటే‌ 

వద్దురా మా తాత నన్ను తిడతాడు
రెడ్డిగాని చెట్టుకు తెంపుకొద్దాం అని చెప్పినవ్ కదా రాత్ర ఇప్పుడు ఏమైంది రా

రాత్రి రెడ్డిగాడు నేను కొట్లాడుకున్నం రా ఆడు నేను వోతే మాడి కాయలు ఇయ్యడు అందుకే మీ చెట్టుకు తెద్దం.

సరే ముందు పొట్టిగుట్ట మీద మోదుగు ఆకులు తెంపుకుని
తర్వాత మా గెట్టున ఉన్న యాప చెట్టు ఎక్కి పూత తెంపుకుందాం
మా తాత ఇంటికి వెళ్ళినంక మాడికాయలు తెచ్చుకుందం సరేనా 

నీ మాటలు ఇంటే పట్టపగలు అయితది కానీ
మాడి కాయలకు నా తిప్పలు నేను పడ్త రా సాలే అని 
ఏదేదో...మాట్లాడుకుంటు సక్కగ చోటు గాని చెల్కలకు వాళ్ళ తాత ముందల్కి పోయి. క్యా బుడ్డే కైసా హై అని చిన్నాగాడు చోటు తాతను పలకరించిండు.

అరేయ్ ఓ మనుమడ నన్ను బుడ్డే అంటవ్. లాగు పగుల్తది

సరే తాత ఇయ్యాల ఉగాది పండుగనే
ఉగాది పచ్చడిలో మీ మాడికాయ పచ్చులు కోసి వేస్తే మస్త్ టేస్ట్ వస్తదంట మా తాత చెప్పిండు నాలుగు కాయలు ఇయ్యరాదే

గాయింత దానికి అడగాల్నా మనవడా.
నీ ఇష్టం వచ్చినన్ని కాయలు తీసుకుపో...
చోటు నువ్వు ఎట్ల దోస్తులో మీ తాత నేను చిన్నప్పట్నుంచీ అట్లనే
సోపతిగాళ్ళం. మీ తాత లెక్కనే నువ్వు మాటకారి వాడివోయ్

అరేయ్ బామ్మర్ది
మా తాత మంచి మూడ్ లో ఉన్నాడు కాబట్టి నీకు ఏం అనకుండా కాయలు తీసుకపో అంటుండు‌. లేకపోతే కాకిని కూడా ఆలనీయడు  

చోటు మనం అడిగితే ఎసోంటోళ్ళైనా కాదు లేదు అనరు 
అది మనం అంటే...

సరే కానీ ముందు పని చూడు ఇంటికి పోవాలి
దర్వాజలకు ఆకులు కుట్టాలి ఇంట్ల పూజ అయినంక మనం ఉగాది పచ్చడి తాగాలి ఇంక మస్తు పనులు ఉన్నయ్

సరే చోటు సాలే ఛల్ ఘర్ జాయింగే
పదరా చిన్న బామ్మర్ది ఉగాది పండుగ చేద్దాం











కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

August 12th

ఎప్పుడు చూశానో