అందమైన జ్ఞాపకం
విప్పారిన నా కళ్ళు
ఏదో వింతను చూడబోతున్నాయి
నా చుట్టూరా పరిసరాలను
ఆక్షేపణ లేకుండా వీక్షిస్తుంటే
మనసు మాత్రం
గత జ్ఞాపకాల గురుతుల వెంట కవాతు చేస్తుంది
తనతో...పుష్కర కాలపు పరిచయం
కాదు కాదు నా ఎదలో నిండిన ప్రణయం
నాతో నేను నాలో నేను
మనసులో మాట్లాడుకునే వయసులో అనుకుంటా
తొలిసారి విన్నాను
ఓ అందమైన చరితార్థమైన పేరు
ఆ పేరు విన్న వెంటనే...నాలో ముద్రించుకున్నది ఓ రూపం
ఆ రూపాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా...!
అనే ఉత్సాహం నాలో... మొదలైంది
చూసి చూడగానే అనుకున్నా...
నాతో...నేను సంఘర్షణ పడేలా చేసే ఈ అందాల రాక్షసి
నా ప్రణయ కావ్యాల్లో...కీర్తించబడే దేవత అని
అప్పట్నుంచి తన నిదర్శన భాగ్యంతో...
ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్సాహం కలిగించేది
ఇద్దరి వయసులు పెరిగే కొద్దీ
మనసులు మరింత దగ్గరయ్యాయి
తను చూపులతో...నా మది స్పృశిస్తుంటే
నేను మాత్రం ఆ కన్నుల కదలికలో...
నాపై దాచుకున్న కడలి అంత ప్రేమను ఆస్వాదించా
మా మధ్య మాములు మాటలు తడబడుతుంటే
మాలోపలి...భావాలు కవిత్వ రూపాన్ని పొందాయి
తను దూరమై పోతుంది అనుకునే ప్రతి సారి
మరింత దగ్గరయ్యేది...నా మది ఇంకా మురిసిపోయేలా
నా అభిరుచులు తన యిష్టంగా మార్చుకుంది
ఇద్దరం తరుచూ చూసుకోవడం...మాట్లాడుకోవడం
ఒక వ్యాపకంలా మారింది
అలా చూస్తుండగానే... వసంతాలు గడిచాయి
మదిలో ప్రేమను మాత్రం నేరుగా చెప్పుకోలేక
రెండు మనసులు మధనపడుతూనే...ఉన్నాయి
కన్నవారి బాధ్యతకు అడ్డుచెప్పలేక తను
ఏ బాధ్యత తెలియని నన్ను మనసులో...నింపుకుని
మరొకరి ఆస్తిలా మారిపోయింది
ప్రేమంటే... మనసుకు సంబంధించినది అని
మా ప్రేమ గొప్పదని...జ్ఞాపకాలను తలచుకుని మాట్లాడుకుంటునే
ఇరువురం బాధతోనే మురిసిపోయాం
ఈ గతమంతా...
ఒక్కసారిగా గుర్తొచ్చి
నా ప్రియురాలు మదికి దరిదాపుల్లో...ఉందని
ఎద చప్పుడుతో... ఆవేదనగా పిలుస్తు వెతుకుతుంటే
సమస్తం శూన్యమై పోయేలా
నా మనసంతా...ఏదో తెలియని శోకాన్ని నింపుకుని
లోలోపల విలపిస్తూ...తనని చూసింది
అదే ఆఖరి చూపు అయితే బాగుండు అని
తనవైపు నేరుగా చూసేందుకు సాహసం చేయలేదు
సరికదా... ప్రేమ అనే భావన బరువు మోయడానికి కూడా
శక్తి లేనంత దుఃఖంతో...కన్నుల ధారలై వర్షించాయి
అప్పుడే... మనసు ముక్కలైందో...లేదో తెలియదు కానీ
నా ఊహల్లో తన రూపం మాత్రం ఆవిరైపోయింది
నిన్నటి నా దినచర్యలోని తను ఓ అందమైన జ్ఞాపకంలా మిగిలిపోయింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి